||సుందరకాండ ||

||తత్త్వదీపిక - నాలుగవ సర్గ ||

||తత్త్వ దీపిక: లంకా ప్రవేశము ||


||ఓం తత్ సత్||

సుందరకాండ.
అథ చతుర్థః సర్గః
లంకా ప్రవేశము

తత్త్వదీపిక - నాలుగవ సర్గ

నాలుగవ సర్గ జరిగినది ఇలా చెప్పవచ్చు.

కపిరాజుహితము కోరు ఆ హనుమంతుడు
కామరూపిణీ అగు లంకిణిని తన పరాక్రమముతో జయించి
శ్రేష్ఠమైన నగరమును ద్వారములేని చోటనుంచి
తన ఎడమపాదమును శత్రువుతలపై పెట్టినట్లు
లంకానగరము లో ఎడమపాదము ముందు పెట్టి ఆ నగరములో ప్రవేశించెను.

అక్కడ అనేకమంది అప్రమత్తమైన రక్షకులగు రాక్షసులను చూచెను.
ఆ మహాకపి బంగారుమయమైన ముఖద్వారము గల , పర్వతశిఖరముపైనున్న ,
తామరపూవులతో కూడియున్నతటాకములతో వున్న,
చుట్టబడిన ప్రాకారములతో నున్న రాక్షసాధిపతి భవనమును చూచెను.
అపుడు వేలకొలది రాక్షస రక్షకులచే రక్షింపబడుచున్న
ఆ రాక్షసాధిపతి గృహమును ఆ మహాకపి ప్రవేశించెను.

అది జరిగిన కథ.

ఈ సర్గలో హనుమ లంకాప్రవేశము వర్ణిస్తూ వాల్మీకి
" అద్వారేణ మహాబాహుఃప్రాకార మభిపుప్లువే" అని అంటాడు

ఈ వాక్యములోని "అద్వారేణ" , "మహాబాహు", "ప్రాకారము" అని మూడు మాటలూ ముఖ్యమైనవి.

" అద్వారేణ మహాబాహుఃప్రాకార మభిపుప్లువే" అంటే,
శత్రువుల పట్టణములోప్రవేశించుచున్నప్పుడు
ముఖ్య ద్వారము ద్వారా ప్రవేశించరాదు అన్న రాజనీతిని పరిపాలించి
హనుమ తన స్వామికి శత్రువగు రావణుని పట్టణము
"అద్వారము" గా ఉన్నచోట ప్రవేశించెను.
ఇది సామాన్యము, మామూలు.

ఇందులో జ్ఞానియగు మహాపురుషుడుజన్మించు విధానము చూపించబడినది.
జ్ఞానుల జన్మ సామాన్య మానవుల జన్మవంటిది కాదు.
జ్ఞానులు అంటే ఆత్మస్వరూపము నెరిగిన వారు.
అంటే ఆత్మ అన్నది దేహము కంటే వేరు అని తెలిసికొనిన వారు,
అట్టివారు భగవత్స్వరూపము దర్శించిన వారవుతారు.
అట్టి వారు జన్మించునది కర్మభోగమునకు కాదు.
వారు భగవదాజ్ఞా నిర్వహణకు జన్మిస్తారు.

ఆదే మాట భగవద్గీతలో కూడా కృష్ణుడు చెపుతాడు (గీత 3-20).
జనకుడు మున్నగువారు నిష్కామ కర్మద్వారా మోక్షముపొంది కూడా
లోకసంగ్రహము కొఱకు కర్మ చేస్తూ వున్నారు.
అంటే జ్ఞానులు లోక సంగ్రహము కొఱకు,
భగవదాజ్ఞా నిర్వహణకు పూనుకుంటారు ఆన్నమాట.

హనుమ లంకిణీని జయించెను.
ఆమె లోనకు వెళ్ళుటకు అనుమతినిచ్చెను.
హనుమ ద్వారము ద్వారా ప్రవేశింపవచ్చును.
కాని హనుమ ప్రవేశింపలేదు.
ప్రాకారము దూకి ప్రవేశించెను.

లంక శరీరము.
శరీరములో ప్రవేశించు ద్వారము, కర్మ అనుభవించవలసిన వారికే.
అనుభవించవలసిన కర్మ లేని వారు ( జ్ఞానులు) ఆ ద్వారము ద్వారా ప్రవేశించ నక్కరలేదు.
అది చెప్పడానికే వాల్మీకి హనుమ "అద్వారము" ద్వారా ప్రవేశించెను అని చెప్పెను.

మరి అనుభవించవలసిన కర్మ లేని వారు ( జ్ఞానులు) జన్మ ఎత్తుట ఎందుకు?
భగవదాజ్ఞచే జీవులను తరింపచేయుటకు.
అది ముందు చెప్పిన మాటే.

హనుమ జ్ఞాని.
హనుమ జ్ఞాని అగుటచే ద్వారముగుండా కాక ప్రక్కనుండి ప్రవేశించెను.
అది 'అద్వారము' ఆన్నమాటకి భావము

"అద్వారేణ" అనుమాటకి ఇంకో భావము కూడా వుంది.

ఇక్కడ అ=భగవంతుడు;
ద్వారేణ - ద్వారములో నిమిత్తముగా ప్రవేశించెను.
అనగా భవంతుని ఆజ్ఞచే భగవంతుని కార్యము మీద
హనుమంతుడు ప్రవేశించెను అని ఇంకో అర్థము.
హనుమంతుడు భగవంతుని కార్యము పై
అంటే సీతా అన్వేషణకై లంకలో ప్రవేశించెను అన్నది మనకి తెలిసినదే.

"అద్వారము" అన్నమాటని ఇంకోవిధముగా చూడవచ్చు.

ముఖ్యద్వారము అన్నమాట మీద మనకు వినపడేవి ఆడంబరము పటాటోపము.
కార్యపరాయణా తత్పరులు- అంటే కార్యమే సాధించవలనని ఆ కార్యములోనే నిమగ్నమై ఉన్నవారికి,
ముఖ్యద్వారము పోవడము వలన కలిగే ఆడంబరములు పటాటోపములు అక్కరలేని వారు.
అట్టివారు ఆ ముఖ్యద్వారము ద్వారా వదిలి పక్కనుంచి ఆడంబరము లేకుండా వెళ్ళడము సహజమే.
ఆ మాటే " అద్వారేణ" లో స్ఫురిస్తుంది.

అది కూడా సబబే.

ఇక రెండవ మాట "మహాబాహు"గురించి.

హనుమ మహాబాహువులు కలవాడు.
బాహువులు కర్మము చేయుటకు సాధనములు
వాటి మహత్వము పొడవుగానుండుట బలిష్ఠముగా నుండుటయే కాదు.
చేసిన కర్మ ఒక బంధము కాకుండా,
అంటే బంధము కాకుండా వుండునట్లు చేయగల బాహువులు కలవాడు మహాబాహుడు.
అంటే ఫలసంగకర్తృత్వములను విడచి కర్మను ఆచరించగలవాడు, ఆచరించువాడు.
అట్టివాడు కర్మమును ఆచరించుచున్ననూ ఆ కర్మలచేత బంధింపబడడు.
అందుకనే అతడు మహాబాహువులు కలవాడు అని.

ఇక మూడవమాట "ప్రాకారము" గురించి

హనుమ ప్రాకారము దూకెను.
అది బంగారు ప్రాకారము.
మనచుట్టు వుండు భోగములు విషయములే మన బంగారు ప్రాకారము.
వానిని లో బంధింపబడకుండా వాటిని దాటి వెళ్ల గలిగిన వాడు జ్ఞాని.
అలాప్రాకారము దూకి వెళ్ళిన హనుమ జ్ఞాని.

అలాగ అద్వారేణ మహాబాహు ప్రాకారము అన్నవి మూడు జ్ఞాని యొక్క లక్షణాలు మనకు సూచిస్తున్నాయి.
ఈ మూడూ హనుమంతుని లక్షణములని మనకు తెలిసినదే.
అది అప్పలాచార్యులవారి భాష్యము.

వాల్మీకి చెప్పిన మూడు మాటలు అందరికి వర్తిస్తాయి.
మానవులు కూడా కర్మ ఫలములను విడిచి మహాబాహువులు కలవారై,
కార్యాచరణ తత్పరులై మహాద్వారము కాక అద్వారముద్వారా వెళ్ళి,
విషయభోగ లాలసులు కాక,
అ బంగారు ప్రాకారమును దాటి విజయము సాధించకలుగుతారు అని కూడా స్ఫురిస్తుంది.

ఇంకొకటి ఎడమకాలు ముందు పెట్టి అన్న మాట .
ఇందులో తత్వార్థము లేకపోయినా ఇది ఎక్కడినుంచి వచ్చినది అన్ని మనకి తోచవచ్చు.
దానికి గోవిందరాజులవారు తన రామాయణ తిలకలో రాశారు.

గోవిందరాజులవారి రామాయణతిలకలో
" అద్వారేణ ప్రవిశేత్ శతృవినాశాయ" అని నీతి శాస్త్రములో చెప్పబడినది అని రాశారు.
శత్రువుల గృహములో లేక పురములో ప్రవేశించునప్పుడు
శతృవినాశము కొఱకు ముఖ్యద్వారములో కాకుండా ప్రక్కనించి పోవలెను
అని నీతిశాస్త్రములో ఉన్నది అని రాశారు.
అది కూడా సబబే.

ఎడమ కాలు ఎందుకు పెట్టాలి?
ఆది విశదీకరిస్తూ గోవిందరాజులవారు ఎడమకాలు ముందు పెడితే
అది శతృవుల తలపై పెట్టినట్లు అవుతుందని విజయ సూచకమని ,
అది రాజశాస్త్రము ప్రకారము అని రాశారు.
దాని మీద ఇంకా బృహస్పతి చెప్పిన మాట కూడా రాస్తారు.-

"ప్రయాణకాలే చ గృహప్రవేశే వివాహకాలేపి దక్షిణాఘ్రిం|
కృత్వా అగ్రతః శతృ పురప్రవేశే వామం నిదధ్యాచరణం నృపాలః | "

అంటే ప్రయాణము మొదలెట్టినపుడు,
వివాహకాలములో గృహప్రవేశము చేసినపుడు,
కుడి కాలు ముందు పెట్టాలి.
శతృ పురములో ప్రవేశించునపుడు
రాజు ఎడమకాలు ముందుపెట్టవలెను అని.

శతృవుల స్థానములో ఎడమ కాలు ముందు పెట్టడము విజయ సూచకము

లంకలో ప్రవేశించిన హనుమంతుడు ఈ శుభ సూచకములతో ఇక ముందుకు సాగుతాడు

||ఓమ్ తత్ సత్||
|| ఇవి శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీత ద్వారా మాకు తెలిసిన మాటలు||
||ఓమ్ తత్ సత్||


 

 

 

 

 

 

||ఓమ్ తత్ సత్||
|| ఇవి శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీత ద్వారా మాకు తెలిసిన మాటలు||
||ఓమ్ తత్ సత్||